TRS: విభజన హామీలను కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉంది: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
- తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కొన్ని సాధించాం
- మిగిలిన వాటిని కూడా సాధిస్తాం
- కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే వస్తుంది
రాష్ట్ర పునర్విభజన హామీల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి కొన్ని సాధించామని, మిగిలిన వాటిని కూడా సాధిస్తామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు ఉందని, తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, నేషనల్ హైవేస్ విషయమై కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు అనుమతి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కలిశామని చెప్పారు. హైకోర్టు విభజన ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాగుతోందని, జనవరి 1 నుంచి కొత్త హైకోర్టు ఏర్పడనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు.
ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే వస్తుంది
వచ్చే ముప్పై ఏళ్లలో ఏ జాతీయ పార్టీ కూడా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వినోద్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదని, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.
2019లో కచ్చితంగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.