rbi: పెద్దనోట్ల రద్దు వల్లే భారత్ ఆర్థిక వృద్ధి రేటు తగ్గింది: రఘురాం రాజన్
- పెద్దనోట్ల రద్దు మంచిది కాదని అప్పుడు చెప్పాను
- 2017లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు వేగం పుంజుకుంది
- భారత్ లో మాత్రం మందగమనంలో సాగింది
పెద్దనోట్ల రద్దు వల్లే భారత్ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు వేగం పుంజుకుంటే, భారత్ వృద్ధి రేట మాత్రం మందగమనంలో సాగిందని, 6.7 శాతానికి మాత్రమే పరిమితమైందని అన్నారు. పెద్దనోట్ల రద్దు స్థూల దేశీయోత్పత్తి జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇందుకు సంబంధించిన పలు పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇంకా చూపిస్తోందని, అందుకే, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ మందగించిందని స్పష్టం చేశారు. జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయాలని, వృద్ధి రేటు తగ్గడంలో జీఎస్టీ ప్రభావం ఉందని అభిప్రాయపడ్డారు.
దీర్ఘకాలంలో జీఎస్టీ బాగానే ఉంటుంది కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతోందని హెచ్చరించారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న సమయంలో పెద్దనోట్ల రద్దుపై తన అభిప్రాయం ఏమిటని కేంద్ర పెద్దలు కోరితే అది మంచి ఆలోచన కాదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. జీఎస్టీని ఇంకొంత మంచి విధానంలో అమలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జీఎస్టీకి ఒకే రేటు విధానం ఉండాలా లేక ఐదు స్లాబుల పద్ధతిలో ఉండాలా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇది చర్చల ద్వారానే తెలుస్తుందని స్పష్టం చేశారు.
ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక ఏవైనా లోటుపాట్లు ఉంటే పరిష్కరించుకోవచ్చు కానీ, ఒక దాని వెంట మరో సమస్య వచ్చి పడుతుంటే ఆ ఆలోచన సరైంది కాదని అన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వారి గురించి అడిగిన ప్రశ్నకు రఘురాం రాజన్ సమాధానమిస్తూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే వారిలో ఒకరికి జైలు శిక్ష పడితే కనుక మిగిలిన వారు జాగ్రత్తగా ఉండి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తారని అభిప్రాయపడ్డారు.