BJP: గుంటూరు బైబిల్ మిషన్ మైదానంలో ప్రధాని మోదీ సభ!
- ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం
- జనవరి ఆరో తేదీన నిర్వహణకు పార్టీ నాయకుల ఏర్పాట్లు
- భారీగా జన సమీకరణకు యత్నాలు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న సాయానికి సంబంధించిన వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీతో రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. వీటిలో ఒకటి జనవరి 6వ తేదీన గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ మైదానంలో నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
రెండు రోజుల క్రితం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమైన రాష్ట్ర అగ్రనేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొదట గోదావరి జిల్లాలో ఈ సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంత జిల్లా కావడంతో సత్తా చాటుకునేందుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే గుంటూరును ఎంపిక చేసినట్లు సమాచారం.
బైబిల్ మిషన్ మైదానం జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, రాష్ట్రానికి మధ్యన ఉండడంతో జన సమీకరణకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభ కోసం కనీసం ఐదు లక్షల మంది వచ్చేలా చూడాలని పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, కక్ష సాధిస్తోందంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న సాయం, అందించిన నిధులు, ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ సభలు ఉపయుక్తమవుతాయని భావిస్తున్నారు. ఈ సభ అనంతరం పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.