Gujarath: ప్రియుడి కష్టం చూడలేక... సొంతింటికి రూ. కోటి కన్నం!
- గుజరాత్ లో ఘటన
- పైలట్ శిక్షణలో ఉన్న ప్రియుడు
- ఫీజు కోసం రూ. 90 లక్షల విలువైన బంగారం దొంగతనం
- పోలీసుల విచారణలో బట్టబయలు
తన ప్రియుడు పైలట్ శిక్షణ కోసం రూ. 20 లక్షలు కావాలని మధనపడుతుంటే చూడలేని ఓ యువతి ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసింది. గుజరాత్ లోని భక్తినగర్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ప్రియాంకా పర్సానా (20)ది సంపన్న కుటుంబం. ఆమె సీఏ చదువుతున్న సమయంలో హేత్ షా (20) అనే యువకుడితో ఏర్పడిన స్నేహం, ప్రేమగా మారింది. హేత్ బెంగళూరులో పైలట్ ట్రైనింగ్ తీసుకుంటుండగా, ఫీజుల నిమిత్తం రూ. 20 లక్షలు అవసరమయ్యాయి. ఈ డబ్బు లేక అతను కుమిలిపోతుంటే, చూసి తట్టుకోలేకపోయిన ప్రియాంక, ఇంటిదొంగగా మారింది.
గత నెల 29న తల్లి ఇంట్లోలేని సమయంలో రూ. 90 లక్షల విలువైన బంగారం, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 64 వేల నగదును హేత్ చేతికిచ్చింది. ఆపై ఇంటిని చిందరవందర చేసి, కొన్ని వస్తువులను ధ్వంసం చేసి, దోపిడీ జరిగినట్టు నమ్మించింది.
ప్రియాంక తండ్రి కిశోర్ పర్సానా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును విచారించగా, తొలుత వారికేమీ క్లూ లభించలేదు. బీరువాలను పగలగొట్టకుండా చాకచక్యంగా మారు తాళంతో దొంగతనం చేసినట్టు గుర్తించిన పోలీసులు, బాగా తెలిసిన వారే ఈ పని చేశారని భావించి, ప్రియాంక కాల్ డేటాను పరిశీలించారు. వారికి హేత్ పై అనుమానం రాగా, బెంగళూరుకు వెళ్లిన పోలీసుల టీమ్, అతని వద్ద ఉన్న ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి, గుజరాత్ కు తీసుకు వచ్చారు.
ఇక తమ ఇంట్లో దొంగతనం చేసింది సొంత కుమార్తేనని తెలిసి దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు, కేసును ఉపసంహరించుకున్నారు.