Yanamala: రెండేళ్లుగా రాష్ట్రానికి పైసా విదల్చని కేంద్రం...కక్షతోనే ఇలా: ఆర్థిక మంత్రి యనమల
- నిధుల విడుదలకు కావాలనే మోకాలుడ్డుతోంది
- నీతి అయోగ్ వెంటనే ఇవ్వాలన్నా బేఖాతరు
- చంద్రబాబును దొంగదెబ్బ తీయాలని చూస్తోందని ఆరోపణ
‘కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండేళ్లుగా రాష్ట్రానికి పైసా విదల్చలేదు. రాష్ట్రంపై కక్షకట్టిన పాలకులు నిధుల విడుదలకు కావాలనే మోకాలడ్డుతున్నారు. నిధులు తక్షణం విడుదల చేయాలన్న నీతి అయోగ్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు’ అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు 3,400 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూపాయి ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాల నిధులు కూడా వెనక్కి లాక్కున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని దొంగదెబ్బతీయాలన్న మోదీ కుతంత్రాలకు జగన్, పవన్ వంతపాడుతున్నారని, తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా చేరారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, 2019లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రా ఫలితాలే ఇందుకు నిదర్శనమని జోస్యం చెప్పారు. ఏపీకి న్యాయం జరగాలంటే బీజేపీ కూటమిని ఓడించడమే మార్గమని తెలిపారు.