Jana Sena: అనంతపురం విస్తీర్ణంలో ఉన్న ఇజ్రాయెల్ కూడా అద్భుతాలు చేస్తోంది.. మనం ఎందుకు చేయలేకపోతున్నాం?: పవన్ కల్యాణ్
- నేతల చేతకానితనంతోనే యువత నిర్వీర్యం
- మేం ప్రజలను కలిపే రాజకీయాలను చేస్తాం
- త్వరలోనే ఎన్నారై డాక్టర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు ఏర్పాటు
రాజకీయ నేతల చేతకానితనం కారణంగానే యువత నిస్తేజంగా మారుతోందనీ, పోరాడాలన్న తత్వం తగ్గిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. యథా రాజా.. తథా ప్రజా అనే పరిస్థితి నిజంగానే ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న తెలుగువారు, భారతీయులందరూ కలిసి ఓ సంఘంగా ఏర్పడాలనీ, చిన్నచిన్న గ్రూపులుగా ఉంటే నష్టమేనని పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్ లో ఈరోజు జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
భగత్ సింగ్ 23 ఏళ్లకే దేశం కోసం ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని చెప్పారు. ప్రజలందరూ ఏకమైతే గొప్ప మార్పును తీసుకునిరాగలమని వ్యాఖ్యానించారు. ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విస్తీర్ణంలో అనంతపురం అంతే ఉండే ఇజ్రాయెల్ ఇప్పుడు సాగునీటి రంగం, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తోందని వెల్లడించారు. కానీ సారవంతమైన భూమి, జీవ నదులున్న మనం ఎందుకు చేయలేకపోతున్నామని జనసేనాని ప్రశ్నించారు.
జనసేన ప్రజలను కలిపే రాజకీయాలు చేస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. త్వరలోనే జనసేన తరఫున అమెరికాలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, డాక్టర్ల విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు సాయం చేసేందుకు చాలామంది భారత సంతతి డాక్టర్లు ముందుకు వచ్చారనీ, పలువురు చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న నగదును ఇచ్చారని చెప్పారు.