Pawan Kalyan: నాకు మీడియా ఛానల్స్, పేపర్లు లేవు.. నేను కేవలం ప్రజల హృదయ స్పందనను మాత్రమే నమ్ముతా!: పవన్ కల్యాణ్
- భారత్ లో రాజకీయ జోక్యం ఎక్కువ
- పరిశ్రమల కోసం రాజకీయ నేతలను వేడుకోవాలా?
- హెచ్1బీపై అవసరమైతే అధికారులతో మాట్లాడుతాం
ప్రవాస భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చి చిన్న పరిశ్రమ పెట్టాలని అనుకుంటే రాజకీయ నాయకుల కాళ్లు పట్టుకునే పరిస్థితి నెలకొందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఇది నచ్చని చాలామంది తెలుగువాళ్లు అమెరికాలోనే ఉండిపోతున్నారనీ, మనకెందుకు ఈ గొడవ అని భావిస్తున్నారని అన్నారు. ఈ పద్ధతిని మార్చడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అమెరికాలోని డల్లాస్ లో ఈ రోజు జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
అమెరికాలో రేపు స్థానికులు కానివాళ్లందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేస్తే పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలుగువారి తరఫున పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందనీ, అవసరమైతే హెచ్1బీ వీసాల విషయంలో కేంద్రంతో పాటు అమెరికా అధికారులతోనూ మాట్లాడుతామని స్పష్టం చేశారు.
తనకు మీడియా ఛానల్స్, వార్తా పత్రికలు లేవనీ, ప్రజల హృదయ స్పందనను నమ్ముతానని చెప్పారు. ప్రజలు ఎప్పుడు వ్యక్తులను కాకుండా వ్యవస్థలను నమ్మాలని పేర్కొన్నారు. వ్యక్తులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరనీ, కానీ వ్యవస్థలు, సంప్రదాయాలు కొనసాగుతాయని తెలిపారు. భారత్ లో ముఖ్యమంత్రి తెలిస్తే ఒకలా, తెలియకుంటే మరోలా వ్యక్తులను చూస్తారని వ్యాఖ్యానించారు.