Andhra Pradesh: నేను విశ్వనరుడిని.. యువత భవిష్యత్ నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోను!: పవన్ కల్యాణ్
- అధికారంతోనే మార్పు సాధ్యం
- 2019లో గెలుస్తానో లేదో దేవుడికే తెలుసు
- డల్లాస్ లో ప్రవాసగర్జన సభలో జనసేనాని
ప్రపంచాన్ని మార్చాలన్న ఆశయానికి ముందు మనం మారాలని కోరుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచాన్ని మార్చేముందు తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే మార్పు సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని డల్లాస్ లో ఈ రోజు జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో తెలుగువారిని ఉద్దేశించి జనసేనాని మాట్లాడారు.
తాను 2019లో ఏపీ ముఖ్యమంత్రిని అవుతానో, లేదో భగవంతుడి చేతిలో ఉందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కొందరు నేతలకు ఇంకా డబ్బుపై ఆశ చావలేదని విమర్శించారు. అందువల్లే అవినీతి విలయతాండవం చేస్తోందని చెప్పారు. తాను విశ్వనరుడిని అని వ్యాఖ్యానించారు. తాను ఏ ఒక్క రాష్ట్రం కోసం పనిచేయననీ, దేశం కోసం పనిచేస్తానని తెలిపారు.
పారుతున్న నదికి ఆనకట్ట కట్టేవరకూ భారీ విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చని ఎవ్వరికీ తెలియదనీ, మన యువతలో కూడా అంతే శక్తి నిగూఢంగా ఉందని వెల్లడించారు. యువత జీవితం, భవిష్యత్ నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోబోనని స్పష్టం చేశారు.