Khammam District: తప్పుదోవ పట్టించారు... నట్టేట ముంచారు: ఖమ్మం ఓటమిపై చంద్రబాబుకు నివేదిక

  • అంతర్గత సమస్యల వల్లే ఓడిపోయామని స్పష్టం చేసిన నాయకులు
  • కొందరి ఒంటెద్దు పోకడలతో తీవ్ర నష్టం జరిగిందని వెల్లడి
  • నాయకత్వాన్ని మార్చాలని సూచన

‘ఖమ్మం నియోజకవర్గంలో కచ్చితంగా గెలవాల్సి ఉంది. కానీ కొందరు నాయకుల ఒంటెద్దు పోకడలు, పార్టీ అభ్యర్థిని తప్పుదోవపట్టించిన తీరు కారణంగానే ఓడిపోయాం. ఎన్నికల ముందు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడం కూడా మరో కారణం’... ఖమ్మం నియోజక వర్గంలో టీడీపీ ఓటమికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమి మట్టి కరిచినా ఖమ్మం జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించి గౌరవం దక్కించుకున్న విషయం తెలిసిందే. కూటమి భాగస్వామి టీడీపీకి దక్కిన రెండు ఎమ్మెల్యే స్థానాలు ఈ జిల్లా నుంచే కావడం గమనార్హం.

మూడో స్థానంలో  నామా నాగేశ్వరరావు గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోవడంపై పార్టీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఎన్నికల ముందే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడం, కనీసం ఎన్నికల్లోనైనా డివిజన్‌ స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామని తెలిపారు.

పార్టీ అభ్యర్థి నామా కొన్ని ప్రాంతాలకు ప్రచారానికి కూడా వెళ్లకుండా కొందరు నాయకులు తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఇప్పటికైనా సంస్థాగత కమిటీలను నియమించి నాయకత్వాన్ని మారిస్తే పార్టీకి పునరుజ్జీవనం వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లోగా ఈ అంశాలన్నింటినీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.

Khammam District
district Telugudesam meeting
  • Loading...

More Telugu News