Ameerpet: అమీర్ పేట 'సత్యం' థియేటర్ ప్రాంతంలో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు!
- వాహనదారుల సహనాన్ని పరీక్షించే అమీర్ పేట
- ఫతేనగర్ రోడ్డుపై వైట్ ట్యాపింగ్ పనులు ప్రారంభం
- డిసెంబర్ 31 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు
నిత్యమూ కిటకిటలాడే ట్రాఫిక్ తో వాహనదారుల సహనాన్ని పరీక్షించే హైదరాబాద్, అమీర్ పేట ప్రాంతంలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అమీర్ పేట నుంచి బాలానగర్ వెళ్లే మార్గంలో వైట్ ట్యాపింగ్ పనులు ప్రారంభమైనందున, 16 రోజుల పాటు... అంటే ఈనెల 31 వరకూ ఆంక్షలుంటాయని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.
సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ కు వెళ్లే వాహనాలు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని టీ-జంక్షన్ నుంచి కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, ఏసీ కార్స్, హోలీ క్రాస్ మీదుగా వెళ్లాలని, ఇదే సమయంలో ఫతేనగర్ నుంచి అమీర్ పేట వైపునకు వాహనాల అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అమీర్ పేటకు వచ్చేవారు, సనత్ నగర్ ఫ్లయ్ ఓవర్ నుంచి ఎర్రగడ్డ మీదుగా చేరుకోవాలని సూచించారు. ఎస్ ఆర్ నగర్ జంక్షన్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే మార్గంలో అన్ని సందులనూ మూసివేసి ఉంచుతామని, ప్రజలు సహకరించాలని అంజనీకుమార్ కోరారు.