Rahul Gandhi: రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు!: జీవీఎల్ ఆగ్రహం
- కాంగ్రెస్ చీఫ్ వ్యవహారశైలిని ఖండిస్తున్నాం
- రాహుల్ పాక్ ప్రధాని, హఫీజ్ ను మాత్రమే నమ్ముతారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన బీజేపీ నేత
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ కేసు విషయంలో సుప్రీంకోర్టు విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతిధిని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పాక్ కోర్టులను, ఆ దేశపు ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లనే నమ్ముతారనీ, భారత సుప్రీంకోర్టు, వాయుసేన, ఆర్మీలను నమ్మరని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జీవీఎల్ ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు.
రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం సక్రమంగానే ఉందని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి దాదాపు రూ.58,000 కోట్ల వ్యయంతో 36 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఒప్పందం చేసుకుంది. అయితే తాము గతంలో 126 యుద్ధ విమానాలకు చేసుకున్న ఒప్పందాన్ని బీజేపీ రద్దు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. యూపీఏ హయాంలో ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో పోల్చుకుంటే బీజేపీ ప్రభుత్వం ఒక్కో రాఫెల్ యుద్ధ విమానాన్ని రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి రాజకీయ నేతలు సహా పలువురు పిటిషన్లను దాఖలు చేయగా, వాటన్నింటిని కొట్టివేస్తూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.