malli karjuna kharge: ‘కాగ్’కు సమన్లు పంపించే విషయమై పీఏసీ సభ్యులతో చర్చిస్తా: మల్లికార్జున ఖర్గే
- కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అబద్ధాలు చెప్పింది
- అటార్నీ జనరల్, ‘కాగ్’ కు సమన్ల విషయమై చర్చిస్తా
- ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి
రాఫెల్ డీల్ కు సంబంధించిన వివరాలేవీ ‘కాగ్’కు, దాని ద్వారా పీఏసీకి చేరలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. అటార్నీ జనరల్, ‘కాగ్’ కు సమన్లు పంపించే విషయమై పార్లమెంట్ లోని పీఏసీ సభ్యులతో చర్చిస్తానని అన్నారు. కాగ్ ద్వారా తప్పుడు వివరాలను సుప్రీంకోర్టుకు ఇచ్చినందుకుగాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పును గౌరవిస్తాం కానీ, రాఫెల్ డీల్ పై తప్పనిసరిగా జేపీసీ వేయాల్సిందేనని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
పార్లమెంట్ లో ‘కాగ్’ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్, కాగ్ సమాధానం ఇవ్వాలని, ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తామని స్పష్టం చేశారు. కాగ్’ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది? ఆ నివేదికను పార్లమెంట్ ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు.