AYESHA MEERA: ఆయేషా మీరా హత్య కేసు.. విజయవాడకు చేరుకున్న సీబీఐ అధికారులు!
- మిస్టరీగా మారిన రేప్-మర్డర్ కేసు
- విజయవాడలో సాక్ష్యాలు ధ్వంసం
- సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
బీఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరా హత్య కేసులో సాక్ష్యాల ధ్వంసంపై విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడకు చేరుకున్నారు. విచారణ పూర్తయ్యాక సాక్ష్యాధారాలతో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కాగా సీబీఐ అధికారులు తమ విచారణను గోప్యంగా ఉంచుతున్నారు.
2007, డిసెంబర్ 27న విజయవాడలోని ఓ హాస్టల్ లో ఆయేషా మీరాను గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేశాడు. ఈ కేసులో 2008లో సత్యం బాబు అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, దిగువకోర్టు అతనికి యావజ్జీవశిక్ష విధించింది.
కానీ 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసు మొత్తం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ ఘటనలో దోషులను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు విఫలం కావడంతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఉన్న సాక్ష్యాలు, రికార్డులు ధ్వంసం అయ్యాయని సిట్ చెప్పడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.