Karnataka: ప్రసాదంలో క్రిమిసంహారక మందు.. 11 మంది మృతి వెనక విస్తుపోయే నిజం!
- గోపుర నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం
- ప్రసాదంలో పురుగులు మందు కలిపిన ఓ వర్గం
- 11 మంది మృతి.. ప్రాణాలతో పోరాడుతున్న 31 మంది భక్తులు
కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళవాడిలో శుక్రవారం విషం కలిపిన ప్రసాదం తిని 11 మంది మృతి చెందిన ఘనటలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కిచ్చుగుత్తి గ్రామంలోని మారెమ్మ ఆలయ గోపురం శంకుస్థాపన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గోపుర శంకుస్థాపన అనంతరం పంపిణీ చేసిన ప్రసాదం తిన్న 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 మంది మృతి చెందారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలవడమే కారణమని తేల్చారు. ఓ వర్గం పథకం ప్రకారం ప్రసాదంలో పురుగు మందు కలిపినట్టు అనుమానిస్తున్నారు. గోపుర నిర్మాణం విషయంలో అన్నదమ్ముల (కజిన్స్) మధ్య తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
గ్రామస్థుల కథనం ప్రకారం.. ఆలయ ట్రస్ట్ అధినేత నేత చిన్నప్పి.. గురస్వామి అనే వ్యక్తితో గోపురం కోసం శంకుస్థాపన చేయించారు. దీనిని దేవాంతి (చిన్నప్పి కజిన్) తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆలయంపై ఆయన పెత్తనాన్ని అంగీకరించని ఆయన మహాదేశ్ అనే వ్యక్తితో కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్ధారించారు.
మృతులను బీదరహళ్లి, మేళత్తూర్, దొడ్డానికి చెందిన భక్తులుగా గుర్తించారు. వీరు తమిళనాడులోని మెళమావత్తూర్లో ఉన్న ఆలయాన్ని సందర్శించారు. తిరుగు ప్రయాణంలో వీరు కిచ్చుగుత్తిలోని మారెమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ పంపిణీ చేసిన ప్రసాదం తిన్న 70 మందిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాదితులు చికిత్స పొందుతున్న కేఆర్ఎస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. బీజేపీ నేత యడ్యూరప్పతోపాటు పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. కాగా, మిగిలిపోయిన ప్రసాదాన్ని తిన్న కాకులు కూడా ఆ పరిసరాల్లో చచ్చి పడి ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.