Telangana: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సహకరించలేదు.. అందుకే ఓడిపోయాను!: మహాకూటమి నేత
- వైరాలో కాంగ్రెస్ ఇండిపెండెంట్ కు మద్దతు ఇచ్చింది
- అతను ఇప్పుడు గెలిచి టీఆర్ఎస్ లో చేరిపోయాడు
- కాంగ్రెస్ వైఖరిపై బానోత్ విజయసాయి ఆవేదన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనను మోసం చేశారని మహాకూటమి వైరా అభ్యర్థి బానోత్ విజయసాయి ఆరోపించారు. పొత్తు ధర్మానికి కట్టుబడి కాంగ్రెస్ నేతలు సహకరించి ఉంటే వైరా నియోజకవర్గంలో గెలిచేవాళ్లమని తెలిపారు. కాంగ్రెస్ నేతలు తనకు సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ కు మద్దతు ఇచ్చారని వాపోయారు. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇస్తూ టీఆర్ఎస్ లో చేరిపోయాడని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనా, నైతిక విజయం తనదేనని బానోత్ విజయసాయి తెలిపారు. ఇన్ని కుట్రల మధ్య కూడా తనకు 32,000 ఓట్లు వచ్చాయనీ, వైరా ప్రజల సంక్షేమం కోసం ఇకపై పోరాడుతానని వ్యాఖ్యానించారు. తనపై అభిమానం చూపి ఓటు వేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లానాయకులు దొండపాటి రమేష్, భరత్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, కాంగ్రెస్ నాయకులు గుడివాడ వెంకటేశ్వర్లు, కారేపల్లి మండల సీపీఐ కార్యదర్శి ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.