rear door: బస్సు వెనక డోర్ నుంచి దిగేందుకు అంగీకరించని డ్రైవర్.. కత్తితో పొడిచిన యువకులు
- ముందు డోర్ నుంచి దిగాలన్నందుకు కత్తితో దాడి
- ఇద్దరు నిందితుల పట్టివేత
- ప్రాణాపాయం నుంచి బయటపడిన డ్రైవర్
బస్సులో వెనక డోర్ నుంచి దిగేందుకు డ్రైవర్ అనుమతించకపోవడంతో కొందరు యువకులు అతడిపై కత్తితో దాడి చేశారు. ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో జరిగిందీ ఘటన. డ్రైవర్ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆనంద్ విహార్ నుంచి సీమాపురికి వెళ్తున్న బస్సులో ఎక్కిన ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బస్సులో 22 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారంతా సీమాపురిలో దిగాల్సిన వారే. రాత్రి 10:15 గంటలకు బస్సు సీమాపురి డిపోకు చేరుకుంది.
ప్రయాణికులు బస్సు వెనక డోర్‌ను తెరవాల్సిందిగా డ్రైవర్ చాంద్ (44) ను కోరారు. దీనికి చాంద్ నిరాకరించాడు. నిబంధనల ప్రకారం ముందు నుంచే దిగాలని కోరాడు. వెనక నుంచి దిగేటప్పుడు చైన్ స్నాచింగ్, దొంగతనాలు జరుగుతుంటాయన్న ఉద్దేశంతోనే తాను ముందు నుంచి దిగమని కోరానని డ్రైవర్ తెలిపాడు. అందరూ దిగిన తర్వాత డ్రైవర్ బస్సును డిపోలోకి తీసుకెళ్లి దిగాడు. అతడిని అనుసరించిన ఇద్దరు యువకులు అక్కడ డ్రైవర్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు.
‘‘వారు నన్ను చంపడానికే ప్రయత్నించారు. కానీ వారితో పోరాడా. పెద్ద గాయాలు కాకుండా తప్పించుకున్నా’’ అని చాంద్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ జేబు దొంగలని తెలిపారు.