IB: ఇంటెలిజెన్స్ బ్యూరో, ‘రా’ చీఫ్‌ల పదవీకాలం పొడిగింపు
- ఈ నెలాఖరుకు ముగియనున్న పదవీ కాలం
- రాజీవ్ జైన్, దస్మానా పదవీ కాలం ఆరు నెలల పొడిగింపు
- ఆదేశాలు జారీ చేసిన ఏసీసీ
భారత గూఢచర్య సంస్థ (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుండగా, ‘రా’ కార్యదర్శి అనిల్ కె.దస్మాన పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో వీరి పదవీకాలాన్ని ఆరు నెలలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
1980 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రాజీవ్ జైన్ 30 డిసెంబరు 2016న ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అలాగే, 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ధస్మానాను 29 డిసెంబరు 2016న ‘రా’ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కాగా, నీతి ఆయోగ్‌లో సలహాదారుగా ఉన్న 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవ స్థాయిని పెంచుతూ, ముఖ్య సలహాదారుగా నియమించింది.