Rafele: మోదీ సర్కారుకు భారీ ఊరట... రాఫెల్ డీల్ పై విచారణ అవసరం లేదన్న సుప్రీంకోర్టు!
- కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు
- దేశ భద్రత దృష్ట్యా గోప్యత అవసరమే
- అన్ని పిటిషన్లనూ కొట్టివేసిన ధర్మాసనం
రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు నుంచి నరేంద్ర మోదీ సర్కారుకు భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించడం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఫ్రాన్స్ తో డీల్ తో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన సహేతుక కారణాలూ కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం ఉందని అటార్నీ జనరల్ చేసిన వాదనను అంగీకరిస్తున్నామని, అటువంటి రహస్య ఒప్పందాల్లో భాగంగానే ఈ కేసును విచారించలేమని ధర్మాసనం వెల్లడించింది. మూడు అంశాలను పరిశీలించిన మీదటే తాము ఈ నిర్ణయానికి వచ్చామని, నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం అంశాలను సమీక్షించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కాగా, ఈ ఒప్పందం వెనుక కుంభకోణం ఉందని, నిజాలు నిగ్గు తేలాలంటే, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే సమయంలో రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణ కోరుతూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం, విచారణను పూర్తి చేసి, నవంబర్ 14న తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పిస్తూ, రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణకు నిరాకరిస్తూ, కోర్టు పర్యవేక్షణలో ఎంక్వయిరీ జరిపించాలని దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది.