Narendra Modi: ప్రధాని మోదీ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి: మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చురక
- దేశ వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు
- తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం
ప్రధాని నరేంద్రమోదీకి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చురకలు అంటించారు. ప్రధాని చాలా గొప్పగా మాట్లాడతారని, కానీ తక్కువ వింటారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇకపై తక్కువ మాట్లాడి ఎక్కువ వింటే మంచిదని సెటైర్లు వేశారు. తాజాగా విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడాన్ని గుర్తు చేసిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని అన్నారు.
వ్యవసాయంలో సంక్షోభం, చమురు ధరల పెరుగుదల, నోట్ల రద్దు వంటి వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మోదీ పెద్దపెద్ద విషయాలు మాట్లాడతారు. అందులో తప్పులేదు. అయితే, ఎక్కువగా మాట్లాడేవారు తక్కువగా వింటారు. ప్రధాని మోదీ కూడా అంతే. వ్యవసాయంలో సంక్షోభం, పెద్ద నోట్ల రద్దు, పెట్రో ధరల పెరుగుదల వంటి వాటితో విసిగిపోయిన ప్రజలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఓడించారు’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ ఫలితాల తర్వాత మోదీని ఎలా ఎదుర్కోవాలన్న విషయం తమకు బోధపడిందని ఒమర్ అన్నారు.