West Godavari District: ప్రేమ వివాహం చేసుకున్న పన్నెండేళ్లకు... భార్యను హత్య చేసిన టీవీ చానల్ విలేకరి!

  • భార్యా భర్తల మధ్య విభేదాలు
  • కత్తితో పొడిచి చంపిన భర్త
  • పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం

దాదాపు 12 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆమెతో ఇద్దరు బిడ్డలను కన్న ఓ టీవీ చానల్ విలేకరి, ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు వివరాలు అందించారు. రెడ్డి గణపవరానికి చెందిన తడికమళ్ల లెనిన్, అంతర్వేది గూడెంకు చెందిన కొవ్వాసి సత్యవతి, 12 సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. లెనిన్ టీవీ చానల్ లో, సత్యవతి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తగా, మూడు రోజుల పాటు సెలవు పెట్టిన సత్యవతి, పుట్టింటికి వచ్చింది. ఆపై నిన్న ఉద్యోగానికి వెళుతున్న సమయంలో భర్త, బస్టాండ్ వద్ద కనిపించి తన బైక్ ఎక్కమని కోరాడు. అందుకు ఆమె నిరాకరించగా, బస్టాండ్ వెనుకవైపున్న త్రిశక్తి పీఠం వైపు వస్తే మాట్లాడుకుందామని అడిగాడు. ఆమె అక్కడికి వెళ్లగా, కత్తితో పొడిచి పారిపోయాడని సత్యవతి సోదరి సుశీల తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను ఎడమ చేతివైపు కత్తితో బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

West Godavari District
Murder
Reporter
  • Loading...

More Telugu News