jagan: మనపైకి జగన్, పవన్, కేసీఆర్ లను మోదీ ఎగదోస్తున్నారు: సీఎం చంద్రబాబు
- లాలూచీ రాజకీయాలు చేస్తే చరిత్ర హీనులవుతారు
- టీఆర్ఎస్ ను పవన్, జగన్ లు ఎలా సమర్థిస్తారు?
- మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది
మనపైకి జగన్, పవన్, కేసీఆర్ లను మోదీ ఎగదోస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖపట్టణంలోని చిట్టి వలసలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, లాలూచీ రాజకీయాలు చేసే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని, ఇటువంటి పార్టీని పవన్, జగన్ లు ఎలా సమర్థిస్తారని నిప్పులు చెరిగారు. మోదీ దయాదాక్షిణ్యాలు అవసరమైనందునే విభజన హామీలపై జగన్ ప్రశ్నించరని విమర్శించారు.
ఏపీకి మోదీ మోసం చేస్తున్నారనే టీడీపీ తిరుగుబాటు చేసిందని, ఒక్కడినే పోరాడితే ఉపయోగం లేదని అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నామని అన్నారు. మంచికో చెడుకో రాష్ట్ర విభజన జరిగిందని, ఆదాయం ఆ రాష్ట్రానికి వెళ్లిందని, అయినా, ఏపీని అభివృద్ధి చేసే శక్తి ఆ దేవుడు తనకు ఇచ్చాడని నమ్మానని అన్నారు. కేసుల కోసం వైసీపీ రాష్ట్రాన్ని తాకట్టుపెడుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని విమర్శించారు. బీజేపీ ఓటమికి టీడీపీ కూడా ఓ కారణమని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పనిచేయడం తప్పు అన్నట్టుగా ‘బర్త్ డే గిఫ్ట్..’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.