congress: మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికపై కొనసాగుతున్న ‘కాంగ్రెస్’ కసరత్తు
- రాహుల్ గాంధీ నివాసంలో నేతల భేటీ
- అగ్రనేత సోనియా గాంధీ కూడా హాజరు
- కాసేపట్లో మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులపై ప్రకటన
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసంలో జరుగుతున్న కసరత్తులో ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ పాల్గొన్నారు. అహ్మద్ పటేల్, ప్రియాంక గాంధీ, కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ తదితర సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. కాసేపట్లో మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశముంది.
కాగా, సీఎం ఆశావహులతో రాహుల్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. మధ్యప్రదేశ్ నుంచి కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింథియా సీఎం పదవిని ఆశిస్తుండగా, రాజస్థాన్ నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఆ పదవిని ఆశిస్తున్నారు. ఇక, ఛత్తీస్ గఢ్ నుంచి తమ్రద్ వాజ్ సాహు, భూపేష్ బఘేల్, సింగ్ దేవ్ లు సీఎం పదవిని ఆశిస్తుండటం గమనార్హం.