Andhra Pradesh: స్కూలుకు వెళ్లాలని తల్లిదండ్రుల గద్దింపు.. మనస్తాపంతో 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!
- ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
- పురుగుల మందు తాగిన ఏడో క్లాస్ విద్యార్థి
- ఎమ్మిగనూరులో చికిత్స పొందుతూ మృతి
ఇటీవలి కాలంలో చిన్నారులు మరీ సున్నితంగా తయారవుతున్నారు. ఇంట్లోవాళ్లు తిట్టారనీ, స్నేహితులు మాట్లాడటం లేదన్న చిన్నచిన్న కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తల్లిదండ్రులు మందలించారన్న కారణంతో ఓ బాలుడు మనస్తాపానికి లోనయ్యాడు. పొలంలో చల్లేందుకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని నందవరం మండలం టి.సోములగూడూరులో వేమన్న, సరస్వతి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అంజి(11) అనే కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉండే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజి ఇటీవలి కాలంలో స్కూలుకు సరిగా వెళ్లడం లేదు. త్వరలోనే పరీక్షలు రానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అతనిని మందలించారు. స్కూలుకు సరిగా వెళ్లాలనీ, లేదంటే చదువు మానేసి పొలం పనుల్లో సాయం చేయాలని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో అంజి మనస్తాపానికి లోనయ్యాడు. నిన్న సాయంత్రం పొలంలో చల్లేందుకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమారుడు నురగలు కక్కుతూ కింద పడిపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడిని హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో వేమన్న దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.