khammam: ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ఓటమికి అదేనా కారణం?: టీడీపీ వర్గాల విశ్లేషణ

  • క్రాస్‌ ఓటింగ్‌ కొంప ముంచిందట 
  • భిన్నమైన పరిస్థితిపై అంతర్గత మథనం
  • కొందరు కాంగ్రెస్‌ నాయకులు నామాకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణ

ఖమ్మం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమికి క్రాస్‌ ఓటింగ్‌ కారణమా? అవుననే అంటున్నారు తెలుగుదేశం వర్గీయులు. కొందరు కాంగ్రెస్‌ నాయకులు నామాకు వ్యతిరేకంగా పనిచేసి టీఆర్‌ఎస్‌కు ఓటేయించారని వీరు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించేందుకు ఏకమైన కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఒక్క ఖమ్మం జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో చతికిలపడిన విషయం తెలిసిందే.

మహాకూటమికి వచ్చిన సీట్లలో అత్యధికంగా 8 మంది ఇక్కడి నుంచే గెలుపొందారు. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆరుగురు కాగా, టీడీపీ సభ్యులు ఇద్దరు. ఇంతటి వేవ్‌లోనూ ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమి పాలవ్వడం ఆ పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కచ్చితంగా గెలుస్తారనుకున్న స్థానంలో ఓటమికి క్రాస్‌ ఓటింగే కారణమని తేల్చిచెబుతున్నారు. కొందరు దిగువశ్రేణి కాంగ్రెస్‌ కేడర్‌ నామాకు వ్యతిరేకంగా పనిచేసి క్రాస్‌ ఓటింగ్‌ చేయించారని ఆరోపిస్తున్నారు.

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే ఒక్క సత్తుపల్లిలో మాత్రమే పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అప్పట్లో టీడీపీకి 4,49,228 ఓట్లు పోయ్యాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవం మూడింటే పోటీచేసి మిగిలిన వాటిని మిత్ర పక్షాలకు వదులుకుంది. ఈ మూడింటిలో రెండింట విజయకేతనం ఎగురవేసింది. ఖమ్మం కూడా  గెలుస్తామనుకున్నా ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో పార్టీ వర్గాలు కాంగ్రెస్‌ శ్రేణులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈసారి జిల్లాలో పార్టీకి ఓట్లు  తగ్గినా (2,52,937 వచ్చాయి) సీట్లు పెరిగాయి. అటువంటప్పుడు ఎందుకు ఓడిపోవాల్సి వస్తుందని ఆ పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి.

  • Loading...

More Telugu News