Twitter: 'బ్రాహ్మణ' వివాదంలో ట్విట్టర్ సీఈఓను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2be38aa821d3ae169544b788487edf67175223a0.jpg)
- బ్రాహ్మణులను కించపరిచారంటూ దాఖలైన కేసు
- తీవ్ర వివాదాన్ని రేపిన ప్లకార్డు
- ప్రతినిధి సమక్షంలో విచారించేందుకు కోర్టు అంగీకారం
ఇటీవల ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఇండియాలో పర్యటించిన వేళ, బ్రాహ్మణులను కించపరిచారంటూ దాఖలైన కేసులో, ఆయనను అరెస్ట్ చేయవద్దని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు మాత్రం నిరాకరించింది. ఆయన పట్టుకున్న ఓ ప్లకార్డు తీవ్ర వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణ పితృస్వామ్య వ్యవస్థను నాశనం చేయాలన్న అర్థం వచ్చేలా ఈ ప్లకార్డు ఉండటంతో విమర్శలు చెలరేగాయి. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
ఇండియాకు వెళ్లి ప్రజల మధ్య వైరాలు పెట్టి వచ్చారని డోర్సీపై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన స్వయంగా క్షమాపణలు కూడా చెప్పారు. తన కార్యక్రమానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త తనకు ఆ ప్లకార్డును ఇచ్చారని వివరణ ఇచ్చారు. ఆపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అమెరికా పౌరుడైన అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని, తమ ఆదేశాలు తదుపరి ఉత్తర్వుల వరకూ అమలులో ఉంటాయని, ఈ కేసును అతని న్యాయవాది లేదా ప్రతినిధి సమక్షంలో విచారించ వచ్చని కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో జాక్ డోర్సీ తరఫున న్యాయవాది ముక్తేష్ మహేశ్వరి హాజరయ్యారు.