Tamilnadu: తండ్రిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎల్ కేజీ చిన్నారి.. కారణం విని విస్తుపోయిన పోలీసులు!
- తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఘటన
- స్వచ్ఛభారత్ స్ఫూర్తిని నింపిన బాలిక
- అభినందించిన ఉన్నతాధికారులు
చిన్నారులు దేవుళ్లకు ప్రతిరూపం అంటారు. ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ద్వేషం లేకుండా ఉండటమే అందుకు కారణం. తాజాగా ఓ చిన్నారి తన తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఇంట్లో మరుగుదొడ్డి కట్టడం లేదని వాపోయింది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని వెల్లడించింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రాజపురం వినాయక వీధిలో ఓ కుటుంబానికి చెందిన హనిఫా జార(7) ఎల్ కేజీ చదువుతోంది. అయితే హనిఫా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆమె కాలకృత్యాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాలని తండ్రి ఇసానుల్లాను హనిఫా పలుమార్లు కోరింది. తండ్రితో చాలాసార్లు చెప్పి విసిగిపోయిన బాలిక..చివరికి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేసింది.
తొలుత బాలిక మాటలు విని విస్తుపోయిన పోలీస్ అధికారులు.. ఆ తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ విషయం చివరికి జిల్లా కలెక్టర్ రామన్‌కు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆంబూరు మున్సిపాలిటి అధికారులు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి పనులను ప్రారంభించారు. కాగా, మరుగుదొడ్డి నిర్మాణానికి చొరవ చూపిన చిన్నారిని అధికారులు అభినందించారు.