Abudabhi: కాబోయే భార్యను సరదాగా ‘ఇడియట్’ అన్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్న కుర్రాడు!
- ‘ఇడియట్’ అని మెసేజ్
- కేసు పెట్టిన కాబోయే భార్య
- జరిమానా, జైలుశిక్ష విధించిన న్యాయస్థానం
మాట జారితే వెనక్కి తీసుకోలేమంటారు. ఓ వ్యక్తి అలాగే మాట జారి బుక్కైపోయాడు. అయితే సదరు వ్యక్తి కోపంలో మాట జారలేదు.. సరదాగా అన్నాడు. అంతే.. దాదాపు రూ.4 లక్షల జరిమానాతోపాటు.. రెండు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇది మన దేశంలో జరిగిన సంఘటన కాదు.. అబుదాభిలో జరిగింది.
అసలు విషయంలోకి వెళితే... ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యతో చేస్తున్న ఛాటింగ్‌లో భాగంగా సరదాగా ‘ఇడియట్’ అని మెసేజ్ చేశాడు. దీంతో ఆమె వెంటనే ఆ వ్యక్తిపై కేసు పెట్టింది. విచారించిన న్యాయస్థానం అతనికి 60 రోజుల పాటు జైలు శిక్ష, 20వేల దిర్హామ్స్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.3.92 లక్షలు జరిమానా విధించిందని అక్కడి ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అక్కడి చట్టాల ప్రకారం సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరినైనా దూషిస్తూ మెసేజ్‌లు పంపడం సైబర్ క్రైమ్ కింద నేరం.