Posani Krishna Murali: ఏపీలో కమ్మ కులస్తులంతా అంటరానివారు అయిపోయారు: పోసాని
- దీనికి కారణం చంద్రబాబు, టీడీపీనే
- కమ్మవారంతా ఓటు వేస్తే ఎన్నికల్లో గెలుస్తారా?
- పార్టీని గెలిపించేంత కమ్మ జనాభా రాష్ట్రంలో ఉందా?
ఏపీలో కమ్మవారి పరిస్థితి దారుణంగా ఉందని, తనకు తెలిసినంత వరకు అంటరానివారిగా బతుకుతున్నారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. చంద్రబాబు, టీడీపీలే దీనికంతా కారణమని మండిపడ్డారు. గతంలో చిలకలూరిపేటలో ఎమ్మెల్యే అనుచరుడి ఇంటికి తాను వెళ్లానని... నాకు ఓటు వేస్తారా? అని ఆయన తల్లిని తాను అడిగానని... తాను కమ్మవారికే ఓటు వేస్తానని, కాపులకు ఓటు వేస్తే వారు మనల్ని బతకనీయరంటూ ఆమె సమాధానం చెప్పారని అన్నారు. ఇలా ఎవరు చెప్పారని తాను ప్రశ్నించానని... సెల్ ఫోన్లలో మెసేజ్ లు కూడా వచ్చాయని, మనవాళ్లే ఆ మెసేజ్ లను చూపించారని ఆమె అన్నారని తెలిపారు. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ఆమెకు కూడా కుల గజ్జి ఎక్కించారని మండిపడ్డారు.
కాపులకు ఓటు వేయకూడదు, రెడ్లకు ఓటు వేయకూడదు, కమ్మవారంతా కమ్మవారికే ఓటు వేయాలనే భావనను తీసుకొస్తున్నారని పోసాని విమర్శించారు. కమ్మవారంతా ఓటు వేసినంత మాత్రాన చంద్రబాబు గెలుస్తారా? అని ప్రశ్నించారు. ఒంటరిగా పార్టీని గెలిపించేంత కమ్మ జనాభా రాష్ట్రంలో ఉందా? అని అన్నారు. కులం పేరుతో తిరిగేవాడు గాడిద అని విమర్శించారు. తాను కూడా కమ్మవాడినేనని... కమ్మ అని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. కమ్మ అనేది ఒక గుర్తింపు మాత్రమేనని చెప్పారు. ఇతర కులాల పట్ల సహనం, పరమత సహనం ఉండాలని పోసాని చెప్పారు.