bay of bengal: 15 నుంచి ఏపీలో భారీ వర్షాలకు అవకాశం: విశాఖ వాతావరణ కేంద్రం
- దక్షిణ బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్రవాయుగుండం
- ఉత్తర దిశగా ప్రయాణిస్తుండడంతో ఏపీపై ప్రభావం
- మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం మధ్యభాగంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది.
అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నందున 15వ తేదీ నాటికి దీని ప్రభావం ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలపై చూపించే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణపై మాత్రం ప్రభావం ఉండదని తెలిపింది. వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.