Pavan kalyan: తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది: పవన్ కల్యాణ్

- కేసీఆర్‌కి జనసేన తరుఫున శుభాకాంక్షలు
- ఆకాంక్షలను నెరవేరుస్తారన్న నమ్మకం ఉంది
- మనసులోని మాటలను మరోసారి చాటారు
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఇతర నేతలను అభినందిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేసీఆర్‌ను అభినందిస్తూ లేఖను విడుదల చేశారు. ప్రజాకూటమిపై ఎలాంటి విమర్శలు లేకుండా కేసీఆర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాయడం విశేషం.
‘‘తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన, తెలంగాణను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీ నాయకుడు శ్రీ కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటలను మరోసారి చాటి చెప్పారు.
ఈ అఖండ విజయానికి సారధులైన శ్రీ కేసీఆర్ గారు, వారి కుమారుడు శ్రీ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కేసీఆర్ గారు నెరవేరుస్తారన్న నమ్మకం నాలో సంపూర్ణంగా ఉంది. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అని లేఖలో పవన్ పేర్కొన్నారు.