Chandrababu: దేశాన్ని మోదీ ఎలా కుదేలు చేశారో చూడండి.. ఢిల్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్

  • నాలుగున్నరేళ్లలో ఆయన చేసిందేమీ లేదు
  • వ్యవస్థలను నాశనం చేశారు
  • 19 రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్ష పార్టీల నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ వెలగబెట్టింది ఏమీ లేదని,  అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతాంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేశారని, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం మొత్తం 19 రంగాల్లో విఫలమైందంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయకుండా రైతులను ముంచేశారని, గుజరాత్‌ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌(జీఎస్‌పీసీ)ని కాపాడేందుకు ఓఎన్‌జీసీపీపై ఒత్తిడి చేసి, దానిని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. అప్పటి రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్‌కు తెలియకుండా రాఫెల్ డీల్ కుదుర్చుకుని భారీ కుంభకోణానికి తెరలేపారన్నారు. గుజరాత్‌లో మోదీకి అత్యంత సన్నిహితులైన అధికారులను ఢిల్లీకి రప్పించి కీలక అధికారాలు కట్టబెట్టారని, మొత్తం 36 మంది గుజరాత్ కేడర్ అధికారులు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.  

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. బ్యాంకులను నిలువునా ముంచిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వారిని దేశం నుంచి పారిపోయేందుకు వీలు కల్పించారని, సీబీఐని నిర్వీర్యం చేస్తున్నారని, పెద్ద నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారంటూ మొత్తం 19 అంశాలపై కూటమి నేతల ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News