kcr: కేసీఆర్ కు రెండు చోట్ల ఓటు ఉన్న విషయమై విచారించాం!: ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్
- ఈ విషయమై సిద్ధిపేట ఎన్నికల అధికారిని అడిగాం
- జాబితాలో ఆయన పేరుంటే తొలగించామని చెప్పారు
- ఏ వ్యక్తి అయినా రెండు చోట్ల వేస్తే నేరం
ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ కు ఓటు హక్కు ఉందని, రెండు ప్రాంతాల్లో ఆయన తన పేరు ఎలా నమోదు చేసుకుంటారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై సిద్ధిపేట ఎన్నికల అధికారిని అడిగామని, జాబితాలో పేరుంటే తొలగించామని ఆ అధికారి చెప్పారని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి అయినా రెండు చోట్ల ఓటు వేస్తే నేరమని చెప్పారు.
2019 జనవరి ఒకటో తేదీతో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పనకు ఈసీ కసరత్తు చేస్తోందని రజత్ కుమార్ అన్నారు. కొత్తగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేశామని, డిసెంబర్ 26న ముసాయిదా జాబితా ప్రచురిస్తామని తెలిపారు. 2019 జనవరి 25 వరకు వినతులు, అభ్యంతరాల స్వీకరణ, 2019 ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని అన్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.