Telangana: కేటీఆర్ పై నాకు భారీ అంచనాలు ఉండేవి.. కానీ పూర్తిగా నిరాశపరిచారు!: ఖుష్బూ
- టీమ్ కుక్ సదస్సులో కేటీఆర్ ప్రసంగం విన్నాను
- తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశించా
- రాజీవ్ కారణంగానే దేశంలో ఐటీ విప్లవం వచ్చింది
తాను తెలంగాణకు తొలిసారి వచ్చినప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రసంగాన్ని విన్నానని కాంగ్రెస్ నేత, సినీనటి ఖుష్బూ తెలిపారు. యాపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లో కేటీఆర్ ఇచ్చిన ప్రసంగం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడయిన కేటీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని తాను నమ్మానని ఖుష్బూ పేర్కొన్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే తనకు కేటీఆర్ పై భారీ అంచనాలు ఉండేవని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
కానీ కేటీఆర్ పనితీరు తనను పూర్తిగా నిరాశ పరిచిందని ఖుష్బూ విమర్శించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు తప్ప మరేమీ చెప్పలేదనీ, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో కనీసం 50 శాతం కూడా నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ సైతం తండ్రి కేసీఆర్ లాగే హోప్ లెస్ గా తయారయ్యారని విమర్శించారు. నాయకుడు అన్నాక విజన్ ఉండాలనీ, మాజీ ప్రధాని దివంగత రాజవ్ గాంధీ విజన్ కారణంగానే దేశంలో ఐటీ విప్లవం వచ్చిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించకుండా ‘నేను ఇప్పుడు సంపాదించుకుంటా.. నాకు ఇది చాలు’ అని భావించేలా కేటీఆర్ ధోరణి ఉందని మండిపడ్డారు.