India: తొలి టెస్టులో ఇండియా విజయం... టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా అరుదైన రికార్డు!
- 31 పరుగుల తేడాతో భారత్ విజయం
- అశ్విన్, బుమ్రా, షమీలకు తలో మూడు వికెట్లు
- నిలకడగా రాణించినా టార్గెట్ అందుకోవడంలో ఆసీస్ విఫలం
- ప్రతి వికెట్ కూ కనీసం 15 పరుగుల భాగస్వామ్యం
- టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి
అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఆటగాళ్లను 291 పరుగులకు భారత్ ఆలౌట్ చేయడంతో 31 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇదే మ్యాచ్ లో ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఆసీస్ ఆటగాళ్లు, ప్రతి వికెట్ కూ కనీసం 15 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్ లో ప్రతి ఆటగాడూ ఎన్నో కొన్ని పరుగులు చేస్తూ ఆస్ట్రేలియాను విజయానికి దగ్గరగా తీసుకెళ్లేందుకు తమవంతు ప్రయత్నం చేయడంతో ఇది సాధ్యమైంది. ఓపెనర్ల ఫించ్ 11, హారిస్ 26 పరుగులు చేయగా, ఆపై వచ్చిన ఖవాజా 8, మార్ష్ 60, హాండ్స్ కోంబ్ 14, హెడ్ 14, పైనీ 41, కుమిన్స్ 28, స్టార్క్ 28 పరుగులు చేశారు. చివర్లో నాథన్ లియాన్ 38 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించినప్పటికీ, అశ్విన్ వచ్చి, హేజల్ వుడ్ వికెట్ ను సాధించడంలో భారత్ గెలిచింది. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా, షమీలకు తలో మూడు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.