Telangana: నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే... మరో 24 గంటలు ఆగాల్సిందే!
- రేపు ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- మధ్యాహ్నం 2 గంటలకెల్లా ఫలితాలు!
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ఆపై రెండు, మూడు గంటల వ్యవధిలోనే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న విషయమై ఓ స్పష్టత వస్తుందని అంచనా. రాజస్థాన్ విషయంలో సర్వేలన్నీ ఏకకంఠంతో కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చగా, మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఓటర్లు తమ మనోభీష్టాన్ని ఈవీఎంలలో దాచగా, అవి మంగళవారం నాడు తెరచుకోనున్నాయి.
తెలంగాణలోని 31 జిల్లాల్లో 44 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూముల వద్ద అనుక్షణం సీసీటీవీ కెమెరాల నిఘా, సాయుధ భద్రత ఉన్నప్పటికీ, అన్ని పార్టీల ఏజంట్లూ అక్కడే మకాం వేసి వున్నారు. ఇక ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయగా, 20 నిమిషాల పాటు ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒక రౌండ్ లో ఒకేసారి 14 పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్క తేలుతుంది.
ఇక ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. కౌంటింగ్ ఎలా చేయాలన్న విషయమై ఇప్పటికే వీరికి ఓ దఫా శిక్షణ ఇవ్వగా, నేడు రెండో దఫా శిక్షణ ఇవ్వనున్నారు. కౌంటింగ్ ను పరిశీలించేందుకు పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఒక్కో ఏజంట్ ను లోపలికి అనుమతిస్తారు.
ఇక రేపు ఉదయం 8 నుంచి 8.30 మధ్య పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆపై బ్యాలెట్ యూనిట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసే ప్రక్రియ మొదలవుతుంది. రిజల్ట్ బటన్ ను నొక్కగానే, సదరు ఈవీఎంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న విషయం స్క్రీన్ పై కనిపిస్తుంది. వివరాలన్నీ రికార్డు చేసిన తరువాత, రిటర్నింగ్ అధికారి వాటిని ధ్రువీకరించుకుని ఆ రౌండ్ ఫలితాన్ని స్వయంగా ప్రకటిస్తారు.
తొలి నాలుగైదు రౌండ్లలో వచ్చే ఫలితాలను బట్టి, ఉదయం 9.30 నుంచి 10 గంటల సమయానికి చాలా నియోజకవర్గాల్లో గెలిచేది ఎవరన్న విషయమై కొంత స్పష్టత వచ్చేస్తుంది. ఆపై మధ్యాహ్నం 2 గంటలకెల్లా అన్ని నియోజకవర్గ ఫలితాలనూ వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏదిఏమైనా ఈ నరాలు తెగే ఉత్కంఠకు తెరపడాలంటే, మరో 24 గంటలు ఆగాల్సిందే.