Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తేలిపోయింది.. మా ప్రచార వ్యూహాల్లో చాలా లోపాలు ఉన్నాయి!: జీవీఎల్
- ఎన్నికలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయాం
- కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై ప్రజలు సంతోషంగా లేరు
- చంద్రబాబు ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారు
తెలంగాణ ఎన్నికలకు బీజేపీ ఈసారి సరిగ్గా సన్నద్ధం కాలేకపోయిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తమ ఎన్నికల ప్రచార వ్యూహాల్లో చాలా లోపాలు ఉన్నాయనీ, అందువల్లే వెనుకబడ్డామని అంగీకరించారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో, ఓట్లు-సీట్ల పరంగా గణనీయమైన పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవీఎల్ మాట్లాడారు.
కాంగ్రెస్-టీడీపీ కూటమి పొత్తు అనైతిక కలయిక అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. ‘జాతీయ స్థాయిలో చక్రం, బొంగరం తిప్పుతా’ అంటున్న చంద్రబాబు ఇతర నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పడాన్ని తాను విభేదించడం లేదన్నారు. తెలంగాణలో టీడీపీ కారణంగా కాంగ్రెస్ నష్టపోయిందని ఇప్పటికే స్వరాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.