Andhra Pradesh: కేసీఆర్ అనే కలుపుమొక్క చంద్రబాబు ఆలోచనలకు అడ్డు పడుతోంది!: బుద్ధా వెంకన్న
- కేసీఆర్ విమర్శలతో ప్రజలు ఆలోచనలో పడ్డారు
- ప్రజాకూటమికి పట్టం కట్టబోతున్నారు
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
తెలుగుప్రజలు ఎక్కడున్నా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలన్నదే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. కానీ కేసీఆర్ అనే కలుపు మొక్క ఇందుకు అడ్డుపడుతోందనీ, చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతోందని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు నిజంగానే ఆలోచనలో పడ్డారనీ, చంద్రబాబు చేసిన తప్పు ఏమీలేదని వాళ్లు అర్థం చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణలో ఈ నెల 11 తర్వాత తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని వ్యాఖ్యానించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేసీఆర్ కలిసి ప్రధాని మోదీ సాయంతో రహస్య కూటమిని ఏర్పాటు చేశారని బుద్ధా వెంకన్న విమర్శించారు.
తెలంగాణలో చంద్రబాబు కారణంగానే ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని తెలిపారు. చంద్రబాబును అడ్డుకునేందుకు జగన్, పవన్, మోదీ ఏకమయ్యారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.