Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తాం.. కానీ కేసీఆర్ మజ్లిస్ తో కలవకూడదు!: బీజేపీ నేత పురంధరేశ్వరి
- చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జతకట్టారు
- ఏపీకి ద్రోహం చేసిన పార్టీతో ఎన్నికలకు వెళ్లారు
- సీపీఎస్ విధానాన్ని త్వరలోనే రద్దు చేస్తాం
తెలంగాణలో టీఆర్ఎస్ కే తమ మద్దతు ఉంటుందని బీజేపీ నేత పురంధరేశ్వరి ప్రకటించారు. అయితే ఇందుకోసం మజ్లిస్ (ఎంఐఎం) పార్టీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ అధినేత చంద్రబాబు జత కలవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో తెలంగాణ ఎన్నికల్లో జట్టుకట్టడం సిగ్గుచేటన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుకు బీజేపీ అనుకూలంగా ఉందనీ, ఉద్యోగుల డిమాండ్లను అమలు చేస్తామని పురంధరేశ్వరి హామీ ఇచ్చారు.
సీపీఎస్ అంటే..
2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇందులో చేరాయి. కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం 2004, జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరే వారందరూ సీపీఎస్ కిందికి వస్తారు. ఇందులో భాగంగా ఉద్యోగి జీతంలో 10 శాతం కట్ చేస్తారు. కేంద్రం మరో 10 శాతం డిపాజిట్ చేస్తుంది. అయితే పాత విధానంలో పెన్షన్ కు గ్యారెంటీ ఉండేది. కొత్త విధానంలో ఈ పెట్టుబడి మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతుండటంతో పెన్షన్ కు ఎలాంటి గ్యారెంటీ ఉండదు. అంతేకాకుండా పాత విధానంలో ఉద్యోగుల జీతంలో కోత ఉండేది కాదు. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు.