New Delhi: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లోకుర్ పేరుతో ఈ-మెయిళ్లు.. పోలీసులకు ఫిర్యాదు
- తాను జస్టిస్ లోకుర్‌నంటూ వ్యక్తుల్ని ప్రభావం చేస్తున్న వైనం
- విచారణ ప్రారంభించిన పోలీసులు
- ప్రాథమిక సమాచారం సేకరించినట్లు వెల్లడి
సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతోనే ఈ-మెయిళ్లు పంపి పలువుర్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తిపై పోలీసులు నిఘా పెట్టారు. జస్టిస్ మదన్ బి లోకుర్ పేరుతో ఓ వ్యక్తి పంపిన ఈ-మెయిళ్లు న్యాయమూర్తి దృష్టికి రావడంతో ఆశ్చర్యపోవడం ఆయనవంతయింది. ఆయన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు కంప్యూటర్ విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ అవదేశ్ కుమార్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌కు ఫిర్యాదు చేశారు.
సదరు సైబర్ నేరగాడు పంపిన ఈ-మెయిళ్లను అతనికి అందజేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 'ఇప్పటికే బాధ్యుడైన వ్యక్తి గురించి కొంత సమాచారాన్ని సేకరించాం. త్వరలోనే మొత్తం వివరాలు బయటపెడతాం’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
నెల రోజుల క్రితం భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ ఖాతా తెరచి అభ్యంతరకర సమాచారాన్ని పోస్టు చేస్తున్న విషయాన్ని గుర్తించారు. దీనిపై కూడా దర్యాప్తు జరుగుతోంది. దీంతో సైబర్ నేరగాళ్లకు వారూ వీరూ అన్న తేడా లేదన్నది అర్థమవుతోంది.