Jammu And Kashmir: మతసామరస్యానికి ప్రతీక: ఊరంతా హిందువులు.. గ్రామ పెద్దగా ముస్లిం!
- గ్రామంలో 450 కుటుంబాల్లో ఏకైక ముస్లిం కుటుంబం
- ముస్లిం వ్యక్తిని గ్రామ పెద్దగా ఎన్నుకున్న గ్రామస్థులు
- నేటి సమాజానికి ఆదర్శం
భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ సొంతం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే మరో ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. ఇప్పుడక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. భదేర్వా ప్రాంతంలోని భేలన్-ఖరోటి గ్రామంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆ గ్రామంలో మొత్తం 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 449 కుటుంబాలు హిందువులవే. 54 ఏళ్ల చౌదరీ మహ్మద్ హుస్సేన్‌ది ఏకైక ముస్లిం కుటుంబం. ఈయనకు నలుగురు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. గ్రామం మొత్తం హిందువులే నివసిస్తున్నా హుస్సేన్ మాత్రం ఎప్పుడూ వివక్షకు గురికాలేదు. స్థానికులతో సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ తలలో నాలుకలా మెలిగే హుస్సేన్ అంటే గ్రామస్థులకు ఎంతో గౌరవం. అందుకనే ప్రస్తుత ఎన్నికల్లో ఆయనను అందరూ కలిసి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని మతసామరస్యాన్ని చాటారు.
గ్రామపెద్దకు కావాల్సిన అన్ని లక్షణాలు హుస్సేన్‌లో పుష్కలంగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఎన్నిక తమ మధ్య ఉండే సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. తాము ఒంటరిని కామనే భావన వారిలో కలిగించడానికే ఆయనను ఎన్నుకున్నామని, నేటి సమాజానికి తమ గ్రామం ఆదర్శం కావాలని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో తాము మాత్రమే ముస్లింలమన్న భావన తమకెప్పుడూ రాలేదని హుస్సేన్ పేర్కొన్నారు. తమ జీవితాంతం గ్రామస్థులకు రుణపడి ఉంటామని ఉద్వేగంగా అన్నారు.