Congress: విజయం కూటమిదైతే.. సీఎం పీఠం భట్టి విక్రమార్కదే?
- ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని నడిపించిన ఉత్తమ్
- భట్టివైపే మొగ్గు చూపుతున్న అధిష్ఠానం
- ‘రెడ్డి’ అపవాదును తొలగించుకునే యత్నం
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో లగడపాటి సర్వే నిజమై ప్రజాకూటమి విజయం సాధిస్తే సీఎం అయ్యేది ఎవరు? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎన్నికల్లో అనీ తానై పార్టీని నడిపించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డినే సీఎం పీఠం వరించబోతోందా? అంటే కానేకాదని అంటున్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ తానే ఆ కుర్చీలో కూర్చున్నారు. ఈ ఎన్నికల్లో దీనిని ప్రచార అస్త్రంగా వాడుకున్న కాంగ్రెస్.. కేసీఆర్ తప్పిన మాటను నిజం చేసి చూపించాలని భావిస్తోంది.
ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఆ సీనియర్ నేత, దళితుడు అయిన మల్లు భట్టి విక్రమార్కను సీఎం చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సీనియర్ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహలు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ అధిష్ఠానం మాత్రం భట్టి వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. భట్టిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పీఠం కట్టబెడతారన్న అపవాదును తొలగించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఢిల్లీ పెద్దలు భట్టినే సీఎం చేయాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.