Krishna District: గేదెలను మేపేందుకు వెళ్లిన విద్యార్థికి తగిలిన నాటు తుపాకి బుల్లెట్.. మృతి
- ఎనిమిదో తరగతి చదువుతున్న కరుణానిధి
- పక్షులను కాల్చుతుండగా తప్పిన గురి
- కరుణానిధి నుదుటిపై పేలిన తుపాకి గుండు
గేదెలు మేపేందుకు వెళ్లిన బాలుడు నాటు తుపాకీకి బలయ్యాడు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో శేరిధింటికుర్రు గ్రామానికి చెందిన చిటికనేని నాని కుమారుడు కరుణానిధి (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నేడు రెండో శనివారం శలవు కావడంతో తండ్రికి సాయంగా గేదెలను మేపేందుకు వెళ్లాడు.
అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన 100 ఎకరాల చేపల చెరువుపై పక్షులను తరిమేందుకు గాను ఓ వ్యక్తిని నియమించుకున్నాడు. అతనికి నాటు తుపాకి కూడా ఇచ్చాడు. అతడు పక్షులను కాల్చుతుండగా ఓ బుల్లెట్ గురి తప్పి అదే సమయంలో గేదెలను మేపుతూ అటుగా వెళ్లిన కరుణానిధి నుదుటిలోకి దూసుకుపోయింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.