Odisha: ఒడిశాలో పోటీ చేయనున్న టీడీపీ.. 52 అసెంబ్లీ స్థానాలపై కన్నేసిన చంద్రబాబు!
- ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ
- అధికార పార్టీకి ఇబ్బందేనంటున్న కాంగ్రెస్
- చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిశా రాజకీయాలపై దృష్టి సారించారా? రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశా అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు సైతం తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడుతున్నారా? అంటే టీడీపీ వర్గాలు అవుననే జవాబిస్తున్నాయి. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ ఒడిశాలో 52 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ సీట్లకు పోటీ చేస్తుందని ఒడిశా టీడీపీ చీఫ్ రాజేశ్ పుత్ర తెలిపారు. ఈ ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న తెలుగు జనాభా ఈసారి టీడీపీకే పట్టం కట్టబోతోందని వ్యాఖ్యానించారు. కోరాపుట్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, గంజాం, నబరంగ్ పూర్ జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజేశ్ తెలిపారు. మొత్తం ఐదు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని, వీటిలో కోరాపుట్, నబరంగ్ పూర్, బెహ్రమ్ పూర్, అస్కా లోక్ సభ స్థానాలను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగిందని, పోటీ చేసే మరో స్థానాన్ని ఎంపిక చేయాల్సి ఉందని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతామని రాజేశ్ పేర్కొన్నారు.
ఒడిశాలో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయమై అధికార బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ స్పందిస్తూ.. ఒడిశాలో టీడీపీ ప్రభావం ఉండబోదని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. టీడీపీ పోటీతో బీజేడీ ఓట్లు చీలుతాయనీ, తమకు లాభం కలుగుతుందని వ్యాఖ్యానించింది. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 74 స్థానాలు కావాలి.