natural forming: ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులు డిగ్రీ, పీజీలు చేయాలి: సీఎం చంద్రబాబు
- మన యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి
- ప్రకృతి వ్యవసాయంలో యువత మమేకం కావాలి
- ప్రకృతి వ్యవసాయంపై మరిన్ని పరిశోధనలు జరగాలి
ప్రకృతి వ్యవసాయంపై విద్యార్థులు డిగ్రీ, పీజీలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుంటూరులో ప్రకృతి వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, మన యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయంలో యువత మమేకం కావాలని పిలుపు నిచ్చారు. సహజ వ్యవసాయం అంశాన్ని ఓ పాఠ్యాంశంగా విద్యార్థులు నేర్చుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా 98 శాతం మంది రైతుల ఖర్చు తగ్గిందని, వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేశామని, ఎరువుల వినియోగం తగ్గడంతో రైతులపై రూ.921 కోట్ల భారం, కేంద్రానికి రూ.816 కోట్ల రాయితీ భారం తగ్గాయని, కత్తెర పురుగు ఉద్ధృతిని ప్రకృతి సేద్యం ద్వారా నివారించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మన పంటకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని, భూములకు జియో ట్యాగింగ్ చేసి గుర్తింపు కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సెల్ ఫోన్ ద్వారా అందరూ మార్కెటింగ్ ను విస్తృతం చేయాలని, విదేశాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళతామని అన్నారు.