guntur: ప్రపంచం మొత్తం మన ఆహారం తినాలి: సీఎం చంద్రబాబు
- ప్రకృతి వ్యవసాయం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతా
- ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలవాలి
- రెండంచెల అభివృద్ధిని సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీనే
ప్రకృతి వ్యవసాయం, సాంకేతికతను అనుసంధానం చేయడం కీలకమని, ప్రపంచం మొత్తం మన ఆహారం తినాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుంటూరులో ప్రకృతి వ్యవసాయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతానని, ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలవాలని కోరారు.
2016-17లో 40,656 మంది రైతులు 704 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారని, 2017-18కి ఒక లక్షా అరవై మూడు వేల మంది రైతులు 972 గ్రామాల్లో ప్రారంభించారని, 2018-19లో ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది రైతులు 3,015 గ్రామాల్లో ఐదు లక్షల నాలుగు వేల ఎకరాలను ఈ విధానంలో సేద్యం చేస్తున్నారని, వాళ్లందరినీ అభినందిస్తున్నానని, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారని, ఇదే స్పీడ్ తో వీళ్లు ముందుకు పోతే 2024 కంటే ముందే లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా, ప్రపంచానికి ఒక బహుమతిగా ప్రకృతి సేద్యాన్ని అందించే అదృష్టం మనకొస్తుందని ఆకాంక్షించారు. ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని, సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలని అన్నారు. రెండంచెల అభివృద్ధిని సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని, భవిష్యత్ లో 15 శాతం అభివృద్ధి రేటును సాధించడం లక్ష్యమని అన్నారు.