NTR Biopic: వాయిదా పడనున్న 'మహానాయకుడు'... కారణమిదే!

  • రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్
  • విడుదల మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ కోరుకుంటున్న క్రిష్
  • ఫిబ్రవరి మొదటి వారానికి 'మహానాయకుడు' వాయిదా!

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలను జనవరిలో రెండు వారాల తేడాలో విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతలు మార్చుకున్నారని తెలుస్తోంది. జనవరి 9న మొదటి భాగాన్ని, ఆపై 15 రోజుల తరువాత జనవరి 24న రెండో భాగాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం మేరకు రెండు వారాల మధ్య మరింత గ్యాప్ ఉంటే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. రెండో భాగం విడుదలయ్యే సమయానికి చాలా ప్రాంతాల్లో మొదటి భాగం కూడా ఆడుతూనే ఉంటుందని, దీంతో రెండో భాగానికి థియేటర్ల సమస్య వస్తుందన్న ఆలోచనలో ఉన్న క్రిష్, ఫిబ్రవరికి వాయిదా వేయాలని భావిస్తున్నారని సమాచారం.

రెండు సినిమాల మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉండేట్టుగా ఫిబ్రవరి తొలివారంలో 'మహానాయకుడు' వస్తుందని తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలను, రెండో భాగంలో రాజకీయ నాయకుడిగా ఆయన వైభవాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాల విడుదల మధ్య గ్యాప్ ను పెంచే విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

NTR Biopic
Mahanayakudu
Kathanayakudu
Krish
Release
  • Loading...

More Telugu News