KCR: గతంలో ముందస్తుకు వెళ్లి ఓడిన కోట్ల, ఎన్టీఆర్, చంద్రబాబు... చరిత్రను కేసీఆర్ తిరగరాసేనా?
- ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ముందస్తు
- మూడుసార్లు ఓడిపోయిన అధికార పార్టీ
- కేసీఆర్ చరిత్రను మారుస్తారంటున్న టీఆర్ఎస్ వర్గాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబులు ముందస్తుకు వెళ్లి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో 9 నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ చరిత్రను తిరగరాస్తారా? లేదా వారి మాదిరే ఓటమి పాలవుతారా? అన్న ఆసక్తికర చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.
వాస్తవానికి ముందస్తు ఎన్నికలు రెండు సందర్భాల్లో జరుగుతాయి. వాటిల్లో ఒకటి అనివార్య పరిస్థితుల్లో జరుగుతుంది. అంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడి, ప్రభుత్వం రద్దు కావడం వంటి కారణాలన్నమాట. ఇక విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి, అధికార పార్టీలు ముందుగానే ఎన్నికలకు వెళుతుంటాయి.
ఏపీ ఏర్పడినప్పటి నుంచి మూడు దఫాలు ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన తరువాత, ఆయన ప్రభావంపై భయపడిన నాటి సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి 1983 ఆగస్టులో జరపాల్సిన ఎన్నికలను జనవరిలోనే పెట్టించారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనాన్నే చూపించారు. 202 స్థానాలను గెలుచుకుని తొలిసారిగా సీఎం పీఠాన్నెక్కారు. 1984లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేయించిన ఎన్టీఆర్, 1985లో జరిపిన ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆపై 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సివుండగా, ఎన్టీఆర్ 4 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. ఆ తరువాత 2003లో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్ల దాడి జరిగిన తరువాత చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో ప్రజల సానుభూతి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నా, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
ఇలా ఏపీలో జరిగిన ఈ మూడు ముందస్తు ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఓడిపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు జరిగిన ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ చరిత్రను తిరగరాయడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.