Karnataka: ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకమెంత?... కర్ణాటక ఎన్నికల్లో జరిగిందిదే!
- ఈ సంవత్సరం ఆరంభంలో కర్ణాటక ఎన్నికలు
- ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన పలు సర్వే సంస్థలు
- అంచనాలకు దగ్గరగా వచ్చింది కొన్ని మాత్రమే
దాదాపు రెండున్నర నెలల ఉత్కంఠ వాతావరణం అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సుమారు 1800 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ, స్థానిక మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించాయి. పలు సంస్థలు టీఆర్ఎస్ తిరిగి అధికారాన్ని పొందుతుందని చెబుతుండగా, లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ మాత్రం ప్రజా కూటమిదే అధికారం అంటోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే...
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీ (ఎస్)కు 38 స్థానాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టైమ్స్ నౌ - వీఎంఆర్ సంస్థ బీజేపీకి 90 నుంచి 103 స్థానాలు, కాంగ్రెస్ కు 80 నుంచి 93 స్థానాలు, జేడీ (ఎస్)కు 30 నుంచి 39 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సంస్థ బీజేపీకి 106 నుంచి 118, కాంగ్రెస్ కు 79 నుంచి 82, జేడీఎస్ కు 22 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పింది. ఈ సంస్థల అంచనా వాస్తవ ఫలితానికి దగ్గరగా ఉన్నట్టే అనుకోవచ్చు.
ఇక ఎన్డీటీవీ సంస్థ బీజేపీకి 72 నుంచి 78, కాంగ్రెస్ కు 102 నుంచి 120, జేడీ(ఎస్)కు 35 నుంచి 39 సీట్లు వస్తాయని, రిపబ్లిక్ టీవీ బీజేపీకి 73 నుంచి 82, కాంగ్రెస్ కు 95 నుంచి 114, జేడీ(ఎస్)కు 32 నుంచి 43 సీట్లు వస్తాయని ప్రకటించాయి. ఏబీసీ, సీ-ఓటర్ సంయుక్త సర్వేలో బీజేపీకి 87 నుంచి 99, కాంగ్రెస్ కు 97 నుంచి 109, జేడీ(ఎస్)కు 21 నుంచి 30 సీట్లు వస్తాయని, న్యూస్ నేషన్ సంస్థ బీజేపీకి 71 నుంచి 75, కాంగ్రెస్ కు 105 నుంచి 109, జేడీ(ఎస్)కు 36 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పాయి. టుడేస్ చాణక్య సంస్థ బీజేపీకి 73, కాంగ్రెస్ కు 120, జేడీ(ఎస్)కు 26 సీట్లు వస్తాయని చెప్పింది. కొన్ని సంస్థలు జేడీ(ఎస్) విషయంలో దగ్గరగా అంచనాలు వేసినా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.