Lagadapati Rajagopal: జాతీయ మీడియాకు దక్షిణాదిపై పట్టులేదన్న లగడపాటి!
- జాతీయ సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలం
- అయినా, గులాబీ నేతల్లో కనిపించని ఆనందం
- లగడపాటి సర్వేతో ఉత్కంఠ
తెలంగాణ ఎన్నికలు ముగిసీ ముగియగానే జాతీయ చానళ్లు సర్వేలతో ప్రజలపై దాడి చేశాయి. టైమ్స్ నౌ, ఇండియా టుడే, న్యూస్ ఎక్స్, ఇండియా టీవీ, సీఎన్ఎన్, ఏబీపీ వంటి సర్వేలన్నీ వెలువడ్డాయి. అన్ని సర్వేలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. సీట్లలో కొన్ని అటూ ఇటుగా తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ గద్దెనెక్కడం ఖాయమని తేల్చేశాయి. ఐదారు సర్వేలు టీఆర్‌ఎస్ విజయం ఖాయమని చెప్పినా ఆ పార్టీ నేతల్లో ఎక్కడో అనుమానం కనిపిస్తోందట.
సాయంత్రం ఏడు గంటల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి వెల్లడించిన తన సొంత సర్వే వివరాలను మీడియాకు వెల్లడించారు. జాతీయ చానళ్లు వెల్లడించిన సర్వే వివరాలకు పూర్తి విరుద్ధంగా లగడపాటి సర్వే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణలో ప్రజాకూటమిదే అధికారమని లగడపాటి తేల్చి చెప్పారు. ప్రజా కూటమికి 65కుపైగా స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్‌కు 35కు పైగా స్థానాలు వస్తాయని తేల్చి చెప్పారు. బీజేపీ 5-9, ఎంఐఎం 6-7, ఇండిపెండెంట్లు 5-9 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేశారు.
జాతీయ చానళ్లు అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని ఘంటాపథంగా చెప్పినప్పటికీ, లగడపాటి సర్వేతో ఉలిక్కిపడ్డారు. ప్రజాకూటమి నేతలు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడడానికి, కాంగ్రెస్ నేతలు సంతోషపడడానికి బలమైన కారణమే ఉంది.
దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలపై జాతీయ చానళ్లు గతంలో ఇచ్చిన సర్వేలు ఏవీ నిజం కాలేదని లగడపాటి చెప్పడం ఒక కారణమైతే, ఇప్పటి వరకు ఆయన చేసిన సర్వే వివరాలు వందకు వందశాతం నిజం కావడం ఇంకో కారణం. జాతీయ మీడియాకు దక్షిణాదిపై పట్టులేదని స్వయంగా లగడపాటి చెప్పుకొచ్చారు. దీంతో లగడపాటి చెప్పింది ఎక్కడ నిజం అవుతుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.