KCR: పోలింగ్ సరళిని సమీక్షించిన కేసీఆర్.. గెలుపు తమదేనంటూ ధీమా
- పోలింగ్ సరళిపై కేసీఆర్ సంతృప్తి
- కేసీఆర్‌ను చూసే ఓటేశారంటున్న నేతలు
- మంత్రుల్లో అత్యధిక మంది గెలవబోతున్నారని విశ్లేషణ
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం రాత్రి పోలింగ్ సరళిని సమీక్షించారు. పోలింగ్ శాతంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన ఘన విజయం తథ్యమని చెప్పినట్టు సమాచారం. శుక్రవారం పోలింగ్ ముగిశాక నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్ అభ్యర్థులతో మాట్లాడారు. అలాగే, వివిధ జాతీయ చానళ్లలో వచ్చిన సర్వే వివరాలను కూడా పరిశీలించారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత వందకుపైగా స్థానాల్లో గెలవబోతున్నట్టు మరోమారు చెప్పినట్టు సమాచారం.
పోలింగ్ సరళిని విశ్లేషించిన అనంతరం మెదక్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక సంఖ్యలో స్థానాలను చేజిక్కించుకోబోతున్నట్టు టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఖమ్మంలో పోటాపోటీ ఉంటుందని, హైదరాబాద్‌లోనూ మెజారిటీ స్థానాలు గెలుస్తామని అంచనాకు వచ్చింది. మంత్రుల్లో కొందరికి ప్రతికూలత ఉన్నా ఎక్కువ మంది మంత్రులు గెలవబోతున్నట్టు అంచనాకొచ్చింది. అభ్యర్థుల కంటే కేసీఆర్‌ను చూసే ఓటర్లు టీఆర్ఎస్‌కు ఓటేసినట్టు సరళని బట్టి తేల్చారు.